వంకల్లో పూడిక తీద్దాం.. చెరువుల్లో నీటిని నింపుదాం….

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు

  • వంకల్లో పూడిక తీద్దాం.. చెరువుల్లో నీటిని నింపుదాం..
  • పెద్దవడుగూరులో వేగవంతంగా ఫీడర్ చానెల్ పూడికతీత పనులు
  • రూ.30 లక్షలతో 3 కిలోమీటర్ల మేర పనులు
  • జలధార – జలహారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చర్యలు

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని పెద్దవడుగూరు గ్రామంలోని పందులవాగు వంకలో ఫీడర్ చానెల్ పూడికతీత పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార – జలహారతి కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల వ్యయంతో 3 కిలోమీటర్ల మేర ఈ పనులను నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 6న యాడికి మండలంలో జలధార – జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పనులు వేగం పుంజుకున్నాయి. అదే స్ఫూర్తితో పెద్దవడుగూరులో వర్షపు నీటి నిల్వలను పెంచే లక్ష్యంతో ఫీడర్ చానెల్ పూడికతీత చేపడుతున్నారు.
జలధార – జలహారతి పనులను 100 రోజుల ప్రణాళికతో అమలు చేస్తున్న అధికారులు, పందులవాగు వంకలో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను తొలగించడం ద్వారా నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. దీంతో వర్షపు నీరు వృథా కాకుండా చెరువులు, కుంటలు త్వరగా నిండటానికి అవకాశం ఏర్పడుతోంది. భూగర్భ జలాల పెరుగుదలకు కూడా ఈ పనులు దోహదపడనున్నాయి.
ఫీడర్ చానెల్ పూడికతీత వల్ల సాగునీటి వ్యవస్థ మెరుగుపడటంతో పాటు పంట పొలాలు వరద ముప్పు నుంచి రక్షణ పొందనున్నాయి. నీరు నిల్వ ఉండే సామర్థ్యం పెరగడం వల్ల బోరుబావులు, బావులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు తీసిన పూడిక మట్టిని పొలాలకు తరలించుకుని సారవంతమైన మట్టిగా వినియోగించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా గట్ల వెంట చెట్లు, మొక్కలు, గడ్డి పెరిగి పశువులకు మేత అందుబాటులోకి వస్తుందని వివరించారు.
డ్వామా గుంతకల్లు డివిజన్ సహాయ పథక సంచాలకులు జి.ఆయేషా మాట్లాడుతూ, పందులవాగు వంకలో 3 కిలోమీటర్ల మేర పూడికతీతకు అంచనాలు సిద్ధం చేశామని తెలిపారు. రూ.30 లక్షలతో పనులు చేపట్టగా ప్రస్తుతం 70 మంది ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు.
పెద్దవడుగూరు మండల సాంకేతిక సహాయకుడు చంద్రా నాయక్ మాట్లాడుతూ, గత 13 ఏళ్లుగా ఈ వంకలో పూడికతీత జరగలేదన్నారు. ప్రస్తుతం మొదటి దశలో ఒక కిలోమీటర్ మేర పనులు చేపడుతున్నామని, దీనికి సుమారు రూ.10 లక్షల వరకు కూలీల రూపంలో వ్యయం కానుందని తెలిపారు. ఈ పనులు రైతులకు, పశువులకు, పరిసర చెరువులు, కుంటలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఉపాధి శ్రామికుడు ఆదినారాయణ మాట్లాడుతూ, జలధార – జలహారతి కింద గ్రామంలోనే పని దొరకడం ఆనందంగా ఉందన్నారు. రోజుకు రూ.300 కూలి లభిస్తోందని, ఈ పనుల వల్ల పశువులకు నీటి సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. మరో మహిళా ఉపాధి శ్రామికురాలు మాట్లాడుతూ, పూడికతీత వల్ల రైతులకు, బోరుబావులకు మేలు జరుగుతుందని చెప్పారు.

Posted Under AP
Editor