అనంతపురం జిల్లా, రాయదుర్గం.
వైకాపా రాజకీయ కుట్రలకు పావులు కావద్దు.
_ దళిత సమాజానికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి.
సైకో జగన్ ఐదేళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి, నయవంచనకు గురిచేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా రాజకీయ కుట్రలకు పావులు కావద్దని దళిత సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు రాయదుర్గం పట్టణంలో గురువారం నిర్వహించిన దళిత చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ… ఐదేళ్ల జగన్ పాలనలో దళితులపై అనేక దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. దళితులను హింసించి, హతమార్చిన ఘటనలు రాష్ట్ర ప్రజలను కలచివేశాయన్నారు. డాక్టర్ సుధాకర్ వంటి ప్రతిభావంతుడి మరణానికి జగన్ ప్రభుత్వ కిరాతకత్వమే కారణమని ఆరోపించారు. అలాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నాటి ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయని తెలిపారు. వైకాపా పాలనలో దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దాదాపు 200 మంది దళితులు హత్యకు గురయ్యారని, దళితులపై దాడులు పదిరెట్లు పెరిగాయని పేర్కొన్నారు. వైకాపా పాలనలో జరిగిన అనేక ఘటనలు దళిత సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేశాయని అన్నారు. డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం వంటి ఘటనలను ప్రజలకు గుర్తుచేసి, దళితులపై జరిగిన అన్యాయాలను వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దళిత చైతన్య యాత్రలను నిర్వహిస్తోందన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు హత్యకు గురైన ఘటనలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలిచిందని తెలిపారు. రూ.8.50 లక్షల ఆర్థిక సాయం, ఇంటి పట్టా, ఉచిత సోలార్ ప్యానల్ అందించడంతో పాటు కుటుంబ సభ్యుడికి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు ప్రతి ఇంటికి ఉచిత సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దళితుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని, వైకాపా రాజకీయ కుట్రలకు పావులు కావద్దని దళిత సమాజానికి కాలవ శ్రీనివాసులు సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జి హరిజన ఆనంద్, జిల్లా ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు మల్లి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హనుమంత రెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్ పురుషోత్తం, జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి నాగరాజు, మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకటేషులు,హరిజన నాగమ్మ, నాగరాజు, బండి భారతి, ప్రశాంతి, ధనర్జున ,తదితరులు పాల్గొన్నారు.
