నీటి కోసం విలవిల్లాడుతున్న కృష్ణజింకలు……..

తాడిమర్రి (yes9tv )నీటి కోసం విలవిల్లాడుతున్న కృష్ణజింకలు.. తాడిమర్రి తూర్పు చెరువు ఎండిపోవడంతో రైతులు, వన్యప్రాణుల ఆవేదన
తాడిమర్రి, మే 15:
తాడిమర్రి మండల కేంద్రంలో గల తూర్పు చెరువు దాదాపు ఎన్నో దశాబ్దాలుగా రైతన్నలకు ఒక వరంగా నిలిచింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చెరువు పూర్తిగా అడుగంటిపోవడంతో వందలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువుపై ఆధారపడి ఉన్న భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు బోరు బావులు కూడా ఎండిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాడిమర్రి మండలంలో అధికంగా బత్తాయి సాగు జరుగుతుండగా, తూర్పు చెరువు ఆధారంగా తాడిమర్రి, మద్దెలచెరువు, బంగారంపేట, మోదలకుంట, మరువపల్లి, చిల్లకొండయ్యపల్లి గ్రామాల రైతులు సాగునీటిని వినియోగించుకునేవారు. ఈ చెరువు ఆ గ్రామాల రైతులకు గొప్ప వరంగా ఉండేదని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి హంద్రీనీవా జలాలను చెరువుకు విడుదల చేసి రైతులకు అండగా నిలిచారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తాడిమర్రి చెరువును పట్టించుకోకపోవడంతో నీటి కొరత మరింత తీవ్రమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే నేపథ్యంలో అడవుల్లో సంచరించే జాతీయ జంతువులైన కృష్ణజింకలు నీటి కోసం చెరువు వద్దకు వస్తున్నప్పటికీ, అక్కడ చుక్కనీరు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు అవి గ్రామాల వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ దృశ్యాలను చూసిన గ్రామస్తులు, రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల మనుగడ కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి తక్షణమే త్రాగునీటి వనరులు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాడిమర్రి తూర్పు చెరువుకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Posted Under AP
Editor