కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. “చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడేవారికే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, ప్రత్యర్థులు రక్తాన్ని కోరుకుంటే రక్తాభిషేకం చేసైనా సరే గెలుస్తాం” అంటూ భరత్ మాట్లాడటంపై టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి భయానక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని, ఇది ముమ్మాటికీ వైసీపీ నాయకత్వంలోని అరాచకత్వానికి పరాకాష్ఠ అని ఆయన మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి ఘోర పరాజయాన్ని రుచి చూపించినప్పటికీ, ఆ పార్టీ నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని భానుప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ‘రాక్షస ప్రదేశ్’గా మార్చారని తీవ్రంగా ఆరోపించిన ఆయన.. రాజకీయాల్లో ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోటీ ఉండాలి తప్ప, ‘చంపుతాం, చస్తాం’ అంటూ హింసను ప్రేరేపించే రీతిలో వ్యవహరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు.
ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తూ, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ భరత్‌పై పోలీసులు ఏమాత్రం ఉపేక్షించకూడదని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రక్తాభిషేకం చేస్తామనడం ఫ్యాక్షన్ సంస్కృతిని తలపిస్తోందని దుయ్యబట్టారు.
