అనంతపురం జిల్లా, రాయదుర్గం.
ప్రైవేటు పాఠశాలలువద్దు- ప్రభుత్వ పాఠశాలలే
ముద్దు….
బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి…
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని, అలాగే బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు.
శుక్రవారం కనేకల్ మండల కేంద్రంలోని నేసే పేట ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా పాఠశాలలో చేరిన పిల్లలతో కాసేపు ముచ్చటించి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు 2026 విద్యా సంవత్సరం పాఠశాలల ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలిగించాలని అలాగే ప్రైవేట్ పాఠశాలలు వద్దని ప్రభుత్వ పాఠశాలలే ముద్దని సమాజంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత గురించి అవగాహన పెంచాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంలో ఎస్ ఎస్ సి ఫలితాలను పోలిస్తే ప్రస్తుతం 70 నుండి 77% వరకు పెరిగినట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి ముఖ్య కారణం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు మరియు సౌకర్యాల కల్పనే అని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రయోజనం పొందుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను కనీసం 20% వరకు పెంచాలని విద్యాశాఖ అధికారులను ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని సాధించడానికి విద్యాశాఖ ఉపాధ్యాయులు సిఆర్పిలు మరియు మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ తదితరులు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు
రానున్న ఏడు రోజులపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ల పై పెద్ద ఎత్తున ప్రచారం మరియు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించబడుతుందని విద్యాశాఖ తో పాటు మెప్మా డిఆర్ డి ఏ , ఎంపీడీవో తదితర అధికారుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ చురుకుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ లక్ష్యాన్ని విజయవంతం చేయడంలో భాగంగా జిల్లాలోని కుటుంబాలు మరియు తల్లిదండ్రులందరూ తమ వంతు సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు దుస్తులు (యూనిఫామ్) వంటి అనేక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ జిల్లాలో గత ఏడాది నుంచి సుమారు 600 పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా తీర్చి దిద్దడం జరిగిందని, గతంలో ఇటువంటి పాఠశాలలో అందుబాటులో ఉండేది కావని అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియం చేసుకొని తమ పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు. గతంలో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండేవారని కానీ ఇప్పుడు ప్రతి పంచాయతీలోని మోడల్ ప్రైమరీ స్కూల్ లో కనీసం ఐదు నుండి ఆరుగురు ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటున్నారని అలాగే ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో కనీసం 100 నుండి 150 మంది విద్యార్థులు ఉండాలని ప్రతి తరగతికి 30 నుండి 40 మంది పిల్లలు ఉండేలా అడ్మిషన్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో డీఎస్సీ ద్వారా ఎంపికైన అత్యంత నైపుణ్యం మరియు అర్హత మరియు అనుభవం కలిగిన ఉపాధ్యాయులను ప్రభుత్వం పాఠశాలలో నియమించి విద్యార్థులకు మంచి విద్యా బోధనలు కల్పిస్తున్నదని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్య అందించడం జరుగుతోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ ఫీజులు మరియు ఇతర అదనపు ఖర్చులు ఉంటాయని, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి ఫీజులు లేవు మరియు ప్రభుత్వం అనేక సదుపాయాలను ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి నిబంధనల మేరకు తల్లికి వందనం పథకం కూడా వర్తిస్తుందని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో మౌలిక సౌకర్యాలను కల్పించారనీ జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పలువురి విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి వారితో సెల్ఫీ పాయింట్ ద్వారా ఫోటో సెషన్స్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో విజయసింహారెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో షేక్షావలి, ఎంఈఓ లక్ష్మయ్య , హెడ్మాస్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
