Latest Posts

కునుకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన సమావేశం..

కునుకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన సమావేశం
తాడిమర్రి మండలంలోని కునుకుంట్ల గ్రామపంచాయతీలో వ్యవసాయ యాంత్రీకరణ (అగ్రికల్చరల్ మెకానైజషన్ ) పై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి మరియు విస్తరణాధికారి పాల్గొని రైతులకు ప్రభుత్వ రాయితీ పథకాల గురించి వివరించారు.
అగ్రికల్చరల్ మెకనైజేషన్ రాయితీ పథకం కింద రైతులకు పవర్ టిల్లర్లు, రోటవేటర్లు, హార్వెస్టింగ్ ప్రెషర్లు, స్ప్రేయర్లు, నూర్పిడి యంత్రాలు, విత్తన గొర్రెలు, ట్రాక్టర్ అనుబంధ పరికరాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా సాధారణ రైతులకు 40% రాయితీ, ఎస్సీ/ఎస్టీ మరియు మహిళా రైతులకు 50% రాయితీపై పరికరాలు అందించబడతాయని పేర్కొన్నారు.
ఈ యంత్రాల వినియోగంతో రైతుల ఖర్చులు తగ్గి, పనితీరు మెరుగుపడుతుందని అధికారులు వివరించారు. అవసరమైన రైతులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, లేదా స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందన్నారు.
అర్హతలు:
భూమి కలిగిన రైతులు కావాలి
పట్టాదారు పాస్‌బుక్ ఉండాలి
గత మూడు సంవత్సరాల్లో కనీసం మూడు పంటల సీజన్లలో పంట నమోదు ఉండాలి
గత సంవత్సరం ఈ పథకం లబ్ధి పొందని వారు మాత్రమే అర్హులు
ఒక కుటుంబం నుండి ఒకరికి మాత్రమే అవకాశం
దరఖాస్తుల ఎంపికను పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ లాటరీ విధానం ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సమక్షంలో లాటరీ నిర్వహించి, ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తారు.
దరఖాస్తు గడువు మే 19వ తేదీ వరకు ఉండగా, ఎంపికైన రైతులు 15 రోజుల్లోపు పరికరాల ఖరీదు చెల్లించాలి. అనంతరం 20 నుంచి 25 రోజుల్లో సంబంధిత కంపెనీలు పరికరాలను పంపిణీ చేస్తాయి.
ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఎటువంటి సందేహాలు ఉన్నా స్థానిక రైతు సేవా కేంద్రం లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు.

Posted Under AP
Editor