పొట్లమరి వద్ద రోడ్డు ప్రమాదం….

తాడిమర్రి( yes9tv )పొట్లమరి వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి, నిడిగల్లు గ్రామంలో విషాదం
తాడిమరి మండలం నిడిగిల్లు గ్రామానికి చెందిన గోనుగుంట్ల ఆంజనేయులు, భాగ్యమ్మల కుమారుడు గోనుగుంట్ల దేవేంద్ర వయసు 23 సంవత్సరాలు (యువకుడు) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
దేవేంద్ర ధర్మవరంలోని బస్టాండ్ ప్రాంతంలో తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో పనులు ముగించుకుని తన స్వగ్రామమైన నిడిగిల్లు వైపు బయలుదేరాడు.
ఈ క్రమంలో బత్తలపల్లి మండలం పొట్లమరి గ్రామం సరిహద్దుల్లో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడి నుంచి పరారైంది. ప్రమాదంలో దేవేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి గుండా వెళ్తున్న కొంతమంది వాహనదారులు, ప్రయాణికులు దాదాపు గంటసేపు మానవత్వం చూపకుండా అతనిని ఆసుపత్రికి తరలించకుండా ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం చేశారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే దేవేంద్ర ప్రాణాలు నిలిచేవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తరువాత స్థానికులు అతన్ని ఆర్డిటి ఆస్పత్రికి తరలించగా, తలకు తీవ్ర గాయం తగిలినందున మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే దేవేంద్ర మృతి చెందాడు.
ఈ సంఘటనతో తల్లిదండ్రులు ఆంజనేయులు, భాగ్యమ్మలు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Posted Under AP
Editor