Latest Posts

ప్రకృతి వ్యవసాయ శిక్షణపై జెడిఏ తనిఖీ..

తాడిమర్రి (yes9 tv)
ఈరోజు మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల అధికారులకు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎండీఎస్ ప్రీ మాన్సూన్ డ్రైసోయింగ్, A-1 మోడల్, A-ప్లస్ మోడల్, హాఫ్ మూన్ మోడల్ వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు.
శిక్షణలో భాగంగా బీజ శుద్ధి విధానాలపై ప్రత్యేకంగా వివరించారు. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, బంకమట్టి, బూడిద వంటి సహజ పదార్థాలతో 10–20 రకాల విత్తనాలను ఒకేసారి శుద్ధి చేసి, తొలకరి వర్షాలకు ముందే పొడి నేలలో విత్తితే తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ మంచి మొలకలు వస్తాయని తెలియజేశారు.
ఈ విధానంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, నూనె గింజలు, పప్పుదినుసులు ఎటువంటి రసాయన ఎరువులు లేదా క్రిమిసంహారక మందులు లేకుండా సాగుచేయబడుతూ, ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తాయని అధికారులు వివరించారు. రైతులు తమ పొలాల్లో కనీసం కొంతభాగాన్ని అయినా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి పర్యావరణహిత పద్ధతులను అనుసరించాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ నారాయణ నాయక్, ధర్మవరం డివిజనల్ అధికారి శ్రీ లక్ష్మనాయక్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి, విస్తీర్ణ అధికారులు, ఎంపిఓలు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో కనీసం 100 ఎకరాలను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రేపటి నుంచి గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులను గుర్తించి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ సంవత్సరంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో, రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడం ద్వారా నష్టాలను తగ్గించుకుని లాభదాయక వ్యవసాయం చేయవచ్చని తెలిపారు. గ్రామస్థాయి రైతులు, మహిళా రైతులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ పద్ధతులను అనుసరించి ఒకరికొకరు సహకరించాలని కోరారు.

Posted Under AP
Editor