హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిమ్స్ ప్రాధాన్యత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంజీవనిగా మారుతోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పేదలకు అనుకూలంగా కార్పోరేట్ ఆస్పత్రి సేవలు అందిస్తోంది.
తక్కువ ఫీజు..ఆరోగ్య శ్రీ సౌకర్యంతో పాటుగా అనుభవం ఉన్న వైద్యుల ఆధునిక సేవలతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సుమారు 70 ఏండ్ల చరిత్ర ఉన్న నిమ్స్‌ను వసతులు, సేవల పరంగా చూసినప్పుడు 2014కు ముందు.. 2014 తర్వాత అనే విధంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
పేదల ఆస్పత్రిగా:హైదరాబాద్ నగరంలో పలు ప్రఖ్యాత కార్పోరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఆర్దికంగా ఇబ్బందులు లేని వారికి ఆ ఆస్పత్రుల్లో సేవలు పొందుతున్నారు. పేద ప్రజలకు మాత్రం నిమ్స్ కనిపిస్తోంది. ఏ మాత్రం కార్పోరేట్ సేవలకు తీసిపోకుండా ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికీ పాతతరం వాళ్లు బొక్కల దవాఖాన అంటే టక్కున గుర్తుపడతారు. 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరహార దీక్ష చేసారు. ఆ సమయంలో నిమ్స్ లోనే కేసీఆర్ కు వైద్యం అందించారు. నిమ్స్ కు అన్ని రకాల హంగులు ఉన్నా..2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వసతులు మాత్రం వస్తున్న రద్దీకి అనుగుణంగా లేవు. దీంతో కేసీఆర్ సీఎం అయిన తరువాత ఏటా రూ.100 కోట్లు కేటాయించి నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు క్రమం తప్పకుండా నిమ్స్‌కు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు.
నిమ్స్ మరింత విస్తరణ:ఇప్పుడు నిమ్స్ విస్తరణకు నడుం బిగించారు. 2000 పడకలతో నిర్మించబోతున్న దశాబ్ది భవనాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసారు. దీంతో దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్ ముందు వరుసలో నిలువన్నది. 2014 నాటికి దవాఖానలో 900 పడకలు మాత్రమే ఉండేవి.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ సంఖ్యను 1489కి పెంచారు. అంటే స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే పడకల సంఖ్య 65% పెరిగింది. 2014 నాటికి 111 మంది బోధనా సిబ్బంది ఉండగా నిరుడు చివరినాటికి ఈ సంఖ్య 264కు పెరిగింది. రెసిడెంట్ డాక్టర్లు గతంలో ఏటా 82 మందిని కేటాయించగా, ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు. నిమ్స్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు అందిస్తున్నది. తొమ్మిదేండ్లలో లక్షన్నర మంది లబ్ధిపొం దారు. రూ.533 కోట్ల విలువైన ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందాయి.
