సిల్లీ బచ్చాపై పోటీకి రా- లోకేష్ కు అనిల్ సవాల్-ఆయన ప్రాపకానికి ఆనం పాట్లా ?

ఏపీలో టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కాకరేపుతోంది. పాదయాత్రలో లోకేష్ చేస్తున్న విమర్శలకు రెండు రోజులుగా కౌంటర్లు ఇస్తున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మరో సవాల్ విసిరారు.

నిన్న వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి విసిరిన సవాల్ నే ఇప్పుడు లోకేష్ కూ అనిల్ విసిరారు. దీన్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు.

తనను సిల్లీ బచ్చా అంటున్న నారా లోకేష్.. అదే సిల్లీ బచ్చాతో దమ్ముంటే నెల్లూరు సిటీలో పోటీ చేసి గెలవాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. నెల్లూరు సిటీలో ఇద్దరం తలపడదాం రా.. 2024 లో నా గెలుపుని ఆపగలిగితే..

ముందే చెప్పినట్లు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అన్నారు. నువ్వు ఓడిపోతే 2024 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటావా…అని లోకేష్ ను ప్రశ్నించారు.

తన కుటుంబానికి చరిత్ర లేకున్నా జగన్ అన్న ఆశీస్సులతో మంత్రినయ్యానని, మీ తాత, నాన్న సీఎం లు అయినా ఎమ్మెల్యే కాలేక పోయావంటూ లోకేష్ ను అనిల్ ఎద్దేవా చేశారు. నేనా.. సిల్లీ బచ్చాన.. నువ్వా…అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఇంగ్లిష్ తెలుగు, హిందీ ఇంగ్లీషు ట్రాన్సలేటర్ ఉంటారని, కానీ ఏపీలో తెలుగు టు తెలుగు ట్రాన్సలేటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని లోకేష్ ను ఉద్దేశించి అనిల్ సెటైర్లు వేశారు.

మరోవైపు తాను విసిరిన సవాల్ పాక్షికంగా స్వీకరించి అధిష్టానం ఆదేశిస్తే నెల్లూరులో పోటీ చేస్తానంటూ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా అనిల్ స్పందించారు. తనకు వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో లేదో తెలియదని ఆనం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జగన్ వద్ద తనకు ప్రత్యేకంగా మెప్పు పొందాల్సిన అవసరం లేదన్నారు.

ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ వ్యక్తి ప్రాపకం కోసం ఆనం పాకులాడుతున్నారని విమర్శించారు. 80 ఏళ్ల చరిత్ర ఉన్న కుటుంబ పరువును ఆనం లోకేష్ కాళ్ళ ముందు పెట్టాడన్నారు.

Posted Under AP
YES9 TV