దేశవ్యాప్తంగా తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలన చూశాక ప్రధాని మోడీకి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ కూటమి నిర్మించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు బీహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, టీఎంసీతో పాటు పలు విపక్ష పార్టీలు సమావేశమవుతున్నాయి.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆహ్వానం మేరకు ఆయా పార్టీలు సమావేశమవుతున్నాయి. ఇందులో తొలిసారి రాహుల్, మమత, కేజ్రివాల్ వంటి నేతలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
రేపు పట్నాలో జరిగే మెగా విపక్ష భేటీకి దాదాపు 20 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహం రూపొందించే లక్ష్యంతో ఆయా పార్టీలు సమావేశమవుతున్నాయి. ముఖ్యంగా విపక్షాల్లో ఎవరెక్కడ బలంగా ఉంటే వారితో మిగతా విపక్ష పార్టీలు పోటీపడకుండా మద్దతిచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనను పలు విపక్ష పార్టీలు తెరపైకి తెచ్చాయి.
కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జేడీయూ నుంచి నితీశ్ కుమార్, సీపీఐ నుంచి డీ రాజా, సీపీఎం నుంచి సీతారాం యేచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ , ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్ హాజరు కానున్న ఈ భేటీకి ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం దూరంగా ఉంటున్నారు.
మరోవైపు ఈ భేటీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్సీపీతో పాటు బీజేడీకి కూడా ఆహ్వానం అందలేదు. ఆయా పార్టీలు ఇప్పటికే బీజేపీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతుదారులుగా ఉన్నట్లు విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ పార్టీలకు ఆహ్వానం అందలేదు. విపక్షాల కూటమి భేటీపై ఆయా పార్టీలకు కూడా పెద్దగా అంచనాలు లేవు. దీంతో ఈ పార్టీలు లేకుండానే ఇతర విపక్ష పార్టీలు రేపు భేటీ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి.
