- తుంగభద్ర పునరుద్ధరణతో రైతుల ప్రయోజనాల పరిరక్షణ
- నదుల అనుసంధానంతో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది: సీఎం చంద్రబాబు
హోసపేట (కర్ణాటక), జూన్ 25: తుంగభద్ర ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం, జల వనరుల సమర్థ వినియోగం, రైతుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై సమావేశమవడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
తుంగభద్ర డ్యామ్ మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటిని, లక్షలాది మందికి తాగునీటిని అందిస్తూ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తోందని సీఎం అన్నారు. “తుంగా పానం, గంగా స్నానం” అనే సామెత తుంగ నది జలాల పవిత్రతను తెలియజేస్తుందని గుర్తుచేశారు.
2024లో తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయిన సమయంలో నిపుణుడు కన్నయ్య నాయుడు సహకారంతో స్టాప్‌లాక్ గేట్ ఏర్పాటు చేసి భారీగా నీరు వృథా కాకుండా కాపాడామని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఇప్పుడు 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించడం ద్వారా ప్రాజెక్టు భద్రతను మరింత బలోపేతం చేశాయని చెప్పారు.
నదుల అనుసంధానం అవసరం
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్న చంద్రబాబు, “వన్ నేషన్-వన్ గ్రిడ్, టెలికాం, జాతీయ రహదారి నెట్‌వర్క్‌ల మాదిరిగానే నదుల అనుసంధానం కూడా దేశాభివృద్ధికి కీలకం” అని అన్నారు. దేశంలో గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
కెన్-బేత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నదుల అనుసంధానం విజయవంతంగా అమలవుతోందని, అదే విధంగా గోదావరి-కావేరి అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు విశేష ప్రయోజనాలు చేకూరతాయని వివరించారు.
నీటి పొదుపుపై దృష్టి
ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహాలు తగ్గాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి చుక్క నీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా రాష్ట్రాల అంతర్గతంగా నదుల అనుసంధానం చేపట్టి, అనంతరం రాష్ట్రాల మధ్య అనుసంధాన కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
చారిత్రక సమావేశం
1983లో అప్పటి ప్రధానమంత్రి, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు నీటిని అందించే నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, అదే స్ఫూర్తితో ప్రస్తుతం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతుల ప్రయోజనాల కోసం ఒకే వేదికపై చర్చించడం దక్షిణ భారత జలవనరుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
తుంగభద్ర నదీ తీరం విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి సహజ రక్షణ కవచంగా నిలిచిందని, జోగులాంబ క్షేత్రం, విరూపాక్ష ఆలయం, రాఘవేంద్రస్వామి మఠం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే వెలసాయని గుర్తు చేశారు.
చివరగా, “రాష్ట్రాలుగా మనం వేరైనా దేశంగా మనమంతా ఒక్కటే. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలిసి పనిచేద్దాం” అని సీఎం పిలుపునిచ్చారు.
