Latest Posts

తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు!,…మాండౌస్ తుపాను ఎఫెక్ట్..

మాండౌస్ తుపాను ఎఫెక్ట్ ఏపీపై భారీగానే పడింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాలు జలమయం అయ్యాయి. అయితే భారీ వర్షాలు ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంతో భారీ నష్టం వాటిల్లలేదు. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదు. మరోవైపు మాండౌస్ తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉంది.

ఆదివారం హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘవృతం అయి.. అప్పుడప్పుడు చిరు జల్లులు కురిశాయి. ఈ చిరు జల్లులతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. నిన్న ఆదివారం అయినా చలి విపరీతంగా ఉండడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. పనుల కోసం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నేటి ఉదయం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి సాయంత్రానికి వాయుగుండంగా.. ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. ప్రస్తుతం అల్పపీడనం కూడా బలహీనపడిందని చెప్పారు. వర్షం, చలి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Editor