అమెరికాలో ఇటీవల ఎదురైన తీవ్రమైన సాంకేతిక అంతరాయాల నేపథ్యంలో వైట్‌హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సైబర్ డైరెక్టర్ సీన్ కెయిన్క్రాస్ను ఆయన పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు గంటల తరబడి నిలిచిపోవడం, మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం తలెత్తడంతో ఈ-మెయిల్, బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. చివరకు అత్యంత సున్నితమైన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) నెట్‌వర్క్‌లోనూ తాత్కాలికంగా సమస్యలు తలెత్తడంతో ట్రంప్ యంత్రాంగం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది.
ఈ వరుస సాంకేతిక వైఫల్యాల కారణంగానే సీన్ కెయిన్క్రాస్ను పదవి నుంచి తొలగించామని, ఈ నిర్ణయానికి అధ్యక్షుడు ట్రంప్ పూర్తి మద్దతు తెలిపారని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఫెడరల్ విభాగాల్లో సైబర్ భద్రతా విధానాలు, వ్యూహాలను పర్యవేక్షించే కీలక బాధ్యతల్లో ఉన్న కెయిన్క్రాస్ స్థానంలో రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) కిర్‌స్టెన్ డేవిస్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే తన తొలగింపుపై స్పందించేందుకు కెయిన్క్రాస్ నిరాకరించారు.
ఒకే వారంలో విమానయాన రంగం నుంచి జాతీయ భద్రత వరకు అత్యంత కీలక వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. సైబర్ భద్రతా వ్యవస్థ విషయంలో వైట్‌హౌస్ ఎంత కఠినంగా వ్యవహరించనుందో కెయిన్క్రాస్ తొలగింపు స్పష్టమైన సంకేతమిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ నెట్‌వర్క్‌ల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు ఉండే అవకాశం ఉంది.
