Latest Posts

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆయుష్ (AYUSH) విభాగంలో ఖాళీగా ఉన్న 70 ఉద్యోగాల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రంగం సిద్ధం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య విభాగాల్లోని మొత్తం 45 విభాగాలకు సంబంధించిన లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 2, 2026లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నియామకాలను చేపడుతోంది. ఇప్పటికే ఆయుష్ విభాగంలో 137 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, తాజాగా మరో 70 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత మూడేళ్ల కాలంలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోనే దాదాపు 15 వేల పోస్టులను భర్తీ చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోందని, కాబట్టి అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Editor