ఆంధ్రప్రదేశ్ పరిపాలనను సంపూర్ణంగా గాడిన పెట్టే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రతి శాఖకు నిర్దిష్ట అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తూ కచ్చితమైన గడువులను (Deadlines) ఖరారు చేశారు. ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న దీర్ఘకాలిక భూ సమస్యలకు 2027 మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద సెక్షన్-22ఏ దరఖాస్తులన్నింటినీ 2026 అక్టోబర్ నాటికే పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పేదల గృహ నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ 2027 మార్చి నాటికి 5.32 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని స్పష్టం చేశారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మౌలిక వసతుల కల్పనలో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యతనివ్వాలని సీఎం స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ఇంటికీ వ్యక్తిగత కుళాయి కనెక్షన్ అందించేలా సమగ్ర ప్రణాళికను అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, శౌచాలయాల వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల పునరుద్ధరణను వేగవంతం చేయాలని జలవనరుల శాఖకు ఆదేశాలు ఇచ్చారు. పరిపాలనలో ఆలస్యానికి ఏమాత్రం తావులేకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపించేలా మార్పు తీసుకురావాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర భవిష్యత్ అవసరాలు, యువత ఉపాధి కల్పనపై దృష్టి సారిస్తూ విద్యా, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక లక్ష్యాలను సీఎం ప్రకటించారు. 2027 నాటికి రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించడమే కాకుండా, రాబోయే సాంకేతిక విప్లవానికి అనుగుణంగా 50 లక్షల మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టారు. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తూ 5 లక్షల మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో సకల వసతులు కల్పించాలని ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి, నిర్దేశిత గడువుల్లోగా ఈ ఫలితాలన్నింటినీ ప్రజలకు అందించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.
