Latest Posts

“అసెంబ్లీ వద్ద కౌరవసభను తలపించేలా దాడి!”: సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే దౌర్జన్యాలు జరిగాయంటూ జాతీయ మహిళా కమిషన్‌కు సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు!

తెలంగాణ శాసనసభ ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ గేటు వద్ద మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాష్టీకంపై ఆమె జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్‌పర్సన్‌తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యులను కలిసి అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ ముఖద్వారం వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా దుర్మార్గంగా, నాటి మహాభారత కౌరవసభను తలపించేలా సాగాయని తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న తమను శాసనసభ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మహిళలమన్న కనీస గౌరవం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం హేయమైన చర్య అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. పురుష ఎమ్మెల్యేలను నేలపై పడేసి బూట్లతో తొక్కేశారని, తోపులాటలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం కిందపడిపోయారని గుర్తుచేశారు. ఈ ఘాతుకాలన్నీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ఆదేశాలు, డైరెక్షన్‌తోనే పక్కా వ్యూహం ప్రకారం జరిగాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకపోగా, తమపైనే తప్పుడు కేసులు బనాయించడం, మాజీ సీఎం కేసీఆర్ నివాసం వద్దకు ఆందోళనకారులను పంపడం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రేవంత్ సర్కార్ మహిళా కానిస్టేబుళ్లను అడ్డుపెట్టుకుని ‘శిఖండి రాజకీయాలు’ చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, సెక్షన్-22ఏ పేరుతో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి భారీ భూదందాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ, న్యాయం లేకపోవడం వల్లే తాము ఢిల్లీకి వచ్చి జాతీయ కమిషన్లను ఆశ్రయించాల్సి వచ్చిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీరని సిగ్గుచేటని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఈ దాడులపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు రాస్తున్నామని, దీనిపై జాతీయ కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.

Editor