ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులన్నింటినీ ఈ నెల 30వ తేదీలోగా కొట్టేస్తానని ఒక ఉన్నత స్థాయి న్యాయమూర్తి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చారంటూ విమర్శించారు. మున్సిపల్ శాఖలోని ఒక ఉన్నతాధికారి ద్వారానే తమకు ఈ విశ్వసనీయ సమాచారం అందిందని, న్యాయ వ్యవస్థతో పాటు అధికారులను తమకు అనుకూలంగా మలచుకుంటూ స్థానిక పోరులో గెలవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పేర్ని నాని పేర్కొన్నారు. అక్టోబర్ 17 లేదా 18వ తేదీ నాటికే పోలింగ్, ఓట్ల లెక్కింపుతో సహా యావత్ ఎన్నికల ప్రక్రియను శరవేగంగా ముగించేందుకు అంతర్గత కార్యాచరణ సిద్ధం చేశారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రచారానికి తగిన సమయం దక్కకుండా చేసి, కోర్టుల్లోని కేసులను ఏకపక్షంగా పరిష్కరించుకుని ఎన్నికలకు వెళ్లాలనే తొందరపాటులో ప్రభుత్వం ఉందని విమర్శించిన ఆయన.. ప్రభుత్వ వ్యూహాలను వైఎస్సార్సీపీ పరంగా రాజకీయంగా, చట్టపరంగా దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్య విలువలని తుంగలో తొక్కి ఏకపక్షంగా నిర్వహించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని పేర్ని నాని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హడావుడిగా ఎన్నికలు తీసుకురావాలని చూస్తున్నారని, ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తేల్చిచెప్పారు. ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయపోరాటం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
