సినిమా విజయం వందల కుటుంబాల్లో ఆనందం నింపుతుంది: చిరంజీవి

ఓ సినిమా విజయం సాధిస్తే కేవలం కలెక్షన్లు మాత్రమే రావని, ఆ చిత్రంతో ముడిపడి ఉన్న వందలాది కుటుంబాల్లో ఆనందం నిండుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా హిట్ అయిన వెంటనే విజయాన్ని అందరితో పంచుకోవాలని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలని వరుణ్ తేజ్ తనను ఆహ్వానించినట్లు తెలిపారు. సినిమా విజయం సాధిస్తే బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రమే కాకుండా రోజువారీ పనిచేసే సినిమా కార్మికుల కుటుంబాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నిర్మాతలు, నటీనటులు సైతం ఈ విజయంతో ఎంతో ఆనందాన్ని పొందుతారని అన్నారు.

ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులను చిరంజీవి ‘ప్రేక్షకదేవుళ్లు’గా అభివర్ణించారు. వారి ఆదరణ వల్లే సినిమా పరిశ్రమలోని ఎంతోమంది జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. ‘కొరియన్ కనకరాజు’కు విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ తలవంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చిరంజీవి అన్నారు.

Editor