హులికల్లు ప్రజల ఆత్మీయత మరువలేనిది: ఎమ్మెల్యే కాలవ

అనంతపురం జిల్లా -రాయదుర్గం

  • హులికల్లు ప్రజల ఆత్మీయత మరువలేనిది: ఎమ్మెల్యే కాలవ
  • ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ.. పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

డి.హీరేహాల్ మండలం హులికల్లు గ్రామ ప్రజలు చూపిన ఆత్మీయత తన జీవితంలో ఎప్పటికీ మరువలేనిదని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. డీ.హీరేహాల్ మండలం హులికల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామ ప్రజలు ఎలాంటి కక్షలు, కల్మషాలు లేకుండా ఐకమత్యంతో కలిసి మెలిసి జీవించడం ఆదర్శప్రాయమని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి సోదరభావం నెలకొనాలని ఆకాంక్షించారు.
అనంతరం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గ్రామస్తుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదే సందర్భంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించి స్వయంగా పింఛన్లు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమాల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంతరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగళ్లి రాజు, కల్యం తిప్పేస్వామి, శ్రీరాములు, ఎంపీటీసీలు మొండి మల్లికార్జున, తలారి గంగాధర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor