Latest Posts

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

  • ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” కార్యక్రమం లో భాగంగా గోనెగండ్ల మండలంలో సమస్యల వినతుల స్వీకరణ

కర్నూలు, జూలై 31:-ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శుక్రవారం”ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు.

“ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” లో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వరరెడ్డి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్ఓ వెంకటనారాయణమ్మ, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో ఒక నెలపాటు ప్రతి శుక్రవారం 4 మార్లు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల వినతులను స్వీకరించి వాటి పరిష్కారంపై ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు సమర్పించే వినతుల్లో అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉన్న వాటిని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. మిగిలిన వినతులపై నిర్ణీత గడువులో చర్యలు చేపట్టి, వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి శుక్రవారం స్వీకరించిన వినతులపై తదుపరి శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించి, సమస్య పరిష్కారమైనదా, పెండింగ్‌లో ఉందా, పెండింగ్‌కు గల కారణాలు ఏమిటి, ఎప్పటిలోగా పరిష్కారం అందించగలమనే అంశాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు . ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వచ్చే వినతుల్లో అత్యధికంగా 22-ఏ నిషేధిత జాబితా నుండి భూముల తొలగింపు, రీ-సర్వే అనంతరం తలెత్తిన భూ వివాదాలు, ఇనాం భూముల నమోదు, పట్టా భూముల సమస్యలు, భూ విస్తీర్ణ వ్యత్యాసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ త్వరితగతిన చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా రహదారుల నిర్మాణం, బస్సు సౌకర్యం, బస్ హాల్ట్‌లు, రైల్వే హాల్ట్‌లు, వ్యవసాయ భూములకు దారి, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులు కూడా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు అవసరమైన భూ రికార్డులు, ఇతర పత్రాలతో సిద్ధంగా ఉండడం వల్ల ప్రజలు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి సాధ్యమైనంత మేరకు అక్కడికక్కడే పరిష్కారం అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజలు క్రమశిక్షణతో వినతులు సమర్పించి అధికారులకు సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్, ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఆదోని ఆర్డీవో అరుణాదేవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్, డ్వామా పిడి నరసింహారెడ్డి, డిపిఓ భాస్కర్, డిఆర్డిఏ పిడి శ్రీధర్,ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ మనోహర్,ఐ సి డి ఎస్ పి డి విజయ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor