Latest Posts

ఆస్పరి లో ఉద్రిక్తత: అంబేద్కర్ సర్కిల్‌లో ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన, పోలీసులతో వాగ్వాదం

కర్నూలు జిల్లా
ఆస్పరి లో ఉద్రిక్తత: అంబేద్కర్ సర్కిల్‌లో ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన, పోలీసులతో వాగ్వాదం

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక అంబేద్కర్ సర్కిల్‌ వద్ద ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షి నేతృత్వంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసుల తీరుపై ఎమ్మెల్యే విరూపాక్షి మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగారు.

సీఎం పర్యటన కేవలం ప్రజాధనం దుర్వినియోగమే: ఎమ్మెల్యే విరూపాక్షి
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాగునీటి సమస్య నిర్లక్ష్యం: ఆలూరు నియోజకవర్గ ప్రాంతంలో ఏళ్లుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, ప్రజలు నీటికోసం అల్లాడుతుంటే ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు.

సిఎం సభ వ్యయంతో సమస్య తీరేది: “రేపు (జూలై 25న) ఆస్పరిలో ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేయడానికి ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. కేవలం పార్టీని, కేడర్‌ను బలోపేతం చేసుకోవడానికే సీఎం ఈ సభను ఏర్పాటు చేశారు తప్ప ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు కాదు” అని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేసి, వెనుకబడిన ఆలూరు ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తానని, ముఖ్యంగా నగరడోన రిజర్వాయర్ మరియు వేదవతి ప్రాజెక్ట్ నిర్మిస్తానని ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల సాధన కోసం రేపటి సీఎం సభను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

వెనుకబడిన ఆలూరు ప్రాంత అభివృద్ధికి రేపటి ఆస్పరి సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్ల రూపాయల నిధులు ప్రకటిస్తారో, ఏ మేరకు హామీలు నెరవేరుస్తారో వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

Posted Under AP
Editor