సత్యసాయి జిల్లా కదిరిలో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కదిరి పట్టణంలోని శివాలయంలో జరిగిన చోరీ కేసులో అరెస్టైన నిందితుడు నరసింహులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైనట్లు సమాచారం. పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహులుపై మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. చోరీ కేసులో అరెస్టు చేసి పోలీస్ కస్టడీలో ఉంచిన నిందితుడు, పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిందితుడి పరారుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అసలు ఎలా జరిగింది? భద్రతా లోపమా? లేక మరేదైనా కారణమా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
