షాబాద్ ఘోరకలి: షాబాద్ హత్యల ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి కిరాతక హత్యల ఉదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దారుణ నరమేధంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన “ప్రభుత్వ హత్యలు”గా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు కనీస రక్షణ కల్పించడంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. అత్యంత కీలకమైన హోంశాఖను సైతం తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కనేసం ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు.

ఇంతటి పెద్ద ఘోరం జరిగి ఆరుగురు అమాయకులు బలైనా, ప్రభుత్వం కేవలం స్థానిక ఎస్సై (SI) ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుందని హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల హోంమంత్రిగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా సరే, ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని, అసలు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ఆయన పోలీసు యంత్రాంగాన్ని నిలదీశారు.

ఈ దారుణ ఉదంతంపై ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలతో కాలయాపన చేస్తోందే తప్ప, బాధిత కుటుంబానికి న్యాయం చేసే ఉద్దేశం ఏమాత్రం కనిపించడం లేదని హరీష్ రావు విమర్శించారు. ఈ ఘోర శాంతిభద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Editor