అనంతపురం, జూలై 3:
అనంతపురం జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ భవిత కేంద్రం ప్రాంగణంలో శుక్రవారం ఏడు నియోజకవర్గాల పరిధిలోని భవిత కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు (CWSN) సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ చైర్మన్ గుడిపాటి నారాయణస్వామి,అసిస్టెంట్ కలెక్టర్ సూయాష్ కుమార్, మాంసపు కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రకాశ్ నాయుడు, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఏపీసీ టీ. శైలజ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన హాజరయ్యారు.
ఈ సందర్భంగా 478 మంది దివ్యాంగ విద్యార్థులకు సీపీ చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (TLM)తో పాటు ఇతర అవసరమైన సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 62 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (IERPs)కు గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సహాయక ఉపకరణాలు అందించడం ద్వారా వారి విద్యాభ్యాసం మరింత సులభతరం అవుతుందని, సమగ్ర విద్య లక్ష్యాల సాధనలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సహిత విద్య కోఆర్డినేటర్ ఫణిరాజ్, సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయ సెక్టోరియల్ అధికారులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్‌పీలు, భవిత కేంద్రాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
