Latest Posts

పశుపతినాథుని ఆలయంలో ధ్వజస్థంభం వద్ద తవ్వకాలు..

అనంతపురం జిల్లా రాయదుర్గం

పశుపతినాథుని ఆలయంలో ధ్వజస్థంభం వద్ద తవ్వకాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని చదం గ్రామ సమీపంలో లింగాల బండపై వెలసిన పురాతన చతుర్ముఖ పశుపతినాథుని ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం ధ్వజస్థంబం వద్ద తవ్వకాలు చేపట్టారు. దీంతో ఈప్రాంతం ప్రజలు, భక్తులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. గతంలో బ్రిటీషు వాళ్లు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలు, వజ్ర, వైడుర్యాలు ఎత్తుకెళ్లేవారు. నేటి కాలంలో పురాతన ఆలయాలకు రక్షణ కరువైంది. గతంలో ఈదేవాలయంలో దుండగులు స్వామి వారి మూల విరాట్టును పలు మార్లు తొలగించారు. మూడు నంది విగ్రహాలను ధ్వంసం చేసి గుప్తనిధులు ఎత్తుకెళ్లారు. తాజాగా క్షుద్ర పూజలు చేసి దేవాలయం బయట ఉన్న ధ్వజస్థంబం కట్టకు ఉన్న రాళ్లు తొలగించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఆలయానికి సోమవారం పూజల కోసం వెళ్లిన ఆలయ ప్రధాన అర్చకుడు జడెప్ప, భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామ ప్రజలకు, పోలీసులకు సమాచారం అందించారు. గుప్త నిధుల కోసం పలు మార్లు ఆలయంపై గుప్తనిధుల వేటగాళ్లు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం ఆలయ పరిరక్షణ, భద్రతకు చర్యలు తీసుకోవాలని చదం, చదం గొల్లలదొడ్డి గ్రామాల ప్రజలు, భక్తులు కోరుతున్నారు. రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామ పెద్దల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.

Posted Under AP
Editor