కేసీఎల్-3 ఎన్టీఆర్ ట్రోపీ విజేత కనేకల్లు ఆర్డిటి జట్టు..

  • కేసీఎల్-3 ఎన్టీఆర్ ట్రోపీ విజేత కనేకల్లు ఆర్డిటి జట్టు
  • గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సాహించేందుకు కాలవ క్రికెట్ లీగ్ (కేసీఎల్) పోటీలు దోహదపడతాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. కాలవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాయదుర్గం ప్రిన్స్ 11, కనేకల్లు ఆర్డిటి జట్ల మధ్య ఆదివారం నిర్వహించిన ఫైనల్ క్రికెట్ పోటీల్లో కనేకల్లు ఆర్డిటి జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు ఎన్టీఆర్ ట్రోపీతో పాటు రూ.లక్ష నగదు, రన్నర్ కు రూ.50వేల నగదు బహుమతి అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ఇరు జట్ల క్రీడాకారులను అభినందిస్తూ వారికి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా భావించాలన్నారు. గెలిచినవారు, ఓడినవారు ఇద్దరు మనవాళ్లే కాబట్టి ఈ పోటీల్లో రాయదుర్గం విజయం సాధించిందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల పరస్పర సహకారం, స్నేహభావం, నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వాతావరణాన్ని కల్పించడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకునే క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కేసీఎల్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలను ఘనంగా నిర్వహించిన కాలవ ఫౌండేషన్ చైర్మన్ భరత్‌ను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించి యువతకు వేదిక కల్పించాలని ఎమ్మెల్యే కాలవ ఆకాంక్షించారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కాలవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2018లో ఎన్టీఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించామని ఫౌండేషన్ చైర్మన్ కాలవ భరత్ వివరించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, ప్రతిభను వెలికితీయడం, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
కేసీఎల్ సీజన్-1 లో 129 క్రికెట్ జట్లు, సీజన్-2 లో 203 జట్లు, సీజన్-3 లో 217 జట్లు పాల్గొన్నాయన్నారు. కాలవ ఫౌండేషన్ కేవలం క్రీడలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, ఇండో అమెరికన్ బసవతారకం ఆసుపత్రి సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహింపచేశామన్నారు. ఈ ఏడాది పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశామన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు అందరి సహకారం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. టిడిపి మండల అధ్యక్షులు, యువత, కాలవ టీం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కేసీఎల్-3 ఎన్టీఆర్ ట్రోఫీ క్రికెట్ పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ భరత్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, పూజారి శివ, మండల పార్టీ అధ్యక్షులు కాదలురు మోహన్ రెడ్డి, కురుబ హనుమంతు, వన్నా రెడ్డి, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ రాజ్, సుదర్శన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor