జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం….

అనంతపురం జిల్లా కలెక్టరేట్

 

*జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం*

 

*జిల్లాలో 2.83 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు*

 

*1,623 బూత్‌లు – 5,247 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు*

 

 

అనంతపురం, జూన్ 22:

ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగమైన పల్స్ పోలియో–2026ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో 0–5 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,83,430 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. 31 మండలాల పరిధిలోని 51 పీహెచ్‌సీలు, 25 యూపీహెచ్‌సీలు, 6 పీపీ యూనిట్లతో కలిపి మొత్తం 82 యూనిట్లలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో 1,289, పట్టణ ప్రాంతాల్లో 334 కలిపి మొత్తం 1,623 పల్స్ పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.

జూన్ 28న బూత్‌లలో పోలియో చుక్కలు వేయించలేకపోయిన చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన కార్యక్రమం చేపడతామని తెలిపారు. అలాగే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ట్రాన్సిట్ ప్రాంతాల్లో 58 ప్రత్యేక బృందాలు, 68 మొబైల్ టీంలు పనిచేయనున్నట్లు చెప్పారు.

అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లు, మహిళా సంఘాల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

వ్యాక్సిన్ కోల్డ్‌చైన్ నిర్వహణకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన కలెక్టర్, స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్ తదితర సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఈబి. దేవి, అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ జయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ రావు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. ప్రసన్న భారతి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor