కూటమి రెండేళ్ల పాలనలో సంక్షేమం–అభివృద్ధికి పెద్దపీట
అనంతపురం విజయోత్సవ సభలో ప్రభుత్వ విజయాలను వివరించిన ప్రజాప్రతినిధులు
అనంతపురం, జూన్ 19:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ మార్గంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 16 వేల మంది ఉపాధ్యాయులను పారదర్శకంగా నియమించామని, పోలీసు, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో ఖాళీల భర్తీ కొనసాగుతోందన్నారు. రాయలసీమలో భారీ పెట్టుబడులు ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలవుతున్నాయని తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం కింద సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులకు రూ.500 కోట్లకుపైగా జమ చేశామని, ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.385 కోట్లు, ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల కింద సుమారు రూ.3,000 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. జిల్లాలో హార్టికల్చర్, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జీతాలు, పింఛన్లు సకాలంలో అందుతున్నాయని చెప్పారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు.
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ “విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వైపు” రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. ‘సూపర్ సిక్స్’ హామీల అమలుతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. రాయలసీమలో హార్టికల్చర్, పరిశ్రమల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధికి బీటీపీ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కార్యక్రమాల కింద రూ.3,397.31 కోట్ల మెగా చెక్కును, మహిళా సంఘాలకు రూ.166.72 కోట్ల స్త్రీనిధి చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
