Latest Posts

పిన్నదరిలో టీబీ ముక్త్ భారత్ వైద్య శిబిరం – 93 మందికి ఉచిత డిజిటల్ ఎక్స్‌రే పరీక్షలు

తాడిమర్రి( yes9tv )పిన్నదరిలో టీబీ ముక్త్ భారత్ వైద్య శిబిరం – 93 మందికి ఉచిత డిజిటల్ ఎక్స్‌రే పరీక్షలు
తాడిమర్రి, జూన్ 19:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు, 2030 నాటికి క్షయవ్యాధి (టీబీ) రహిత సమాజ నిర్మాణ లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా తాడిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పిన్నదరి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ (HWC) వద్ద ప్రత్యేక మొబైల్ హ్యాండ్హెల్డ్ డిజిటల్ ఎక్స్‌రే వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ హరిత ఆదేశాల మేరకు పీహెచ్‌సీ సిబ్బంది మరియు క్షయవ్యాధి నియంత్రణ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో గ్రామ ప్రజలకు క్షయవ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్స విధానాలపై అవగాహన కల్పించారు.
క్షయవ్యాధి సోకే అవకాశం ఉన్న వ్యక్తులకు ఉచితంగా డిజిటల్ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించగా, మొత్తం 93 మందికి ఎక్స్‌రేలు తీశారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరఫున ఆరు నెలల పాటు ఉచిత మందులు, పోషకాహార సహాయం అందజేయబడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామ్ కుమార్, ఆరోగ్య కార్యకర్తలు జానకి, రాము, ఎంఎల్‌హెచ్‌పీలు సుభాషిణి, విజయలక్ష్మి, ముబీన్ తాజ్, రేణుక, ఏఎన్‌ఎంలు తులసమ్మ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్షయవ్యాధి నిర్ధారణ సేవలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా టీబీ నిర్మూలన లక్ష్య సాధనకు ఇటువంటి శిబిరాలు ఎంతో దోహదపడుతున్నాయని వైద్య అధికారులు పేర్కొన్నారు.

Posted Under AP
Editor