తాడిమర్రి ( yes9tv )ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అత్యవసర సమావేశం
కలెక్టర్ ఆదేశాల మేరకు పీఎండీఎస్‌పై మండలస్థాయి కార్యాచరణ
తాడిమర్రి, జూన్ 18:
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయడం, రైతులకు సాంకేతిక అవగాహన కల్పించడం లక్ష్యంగా మండలస్థాయిలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇచ్చిన సూచనల మేరకు పీఎండీఎస్ (PMDS) కార్యక్రమంపై ప్రత్యేక డెమో, సాంకేతిక సలహాలు, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై అన్ని శాఖల అధికారులతో చర్చించారు.
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా డౌట్ ప్రూఫ్ పద్ధతులు, ఏటీఎం మోడల్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, రైతులకు సాంకేతిక శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచేందుకు ప్రతి శాఖ తన వంతు భాగస్వామ్యాన్ని అందించాలని అధికారులకు సూచించారు.
మండలంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓలు), ఎన్జీవోలు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, అటవీ, విద్యా, వెలుగు శాఖల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, బంజరు, బీడు, దేవాదాయ ధర్మాదాయ భూములతో పాటు పాఠశాలల ప్రాంగణాలు, పెరటి తోటల్లో కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నారు.
ప్రస్తుత సీజన్లో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయం ఉత్తమ ప్రత్యామ్నాయమని అధికారులు అభిప్రాయపడ్డారు. రైతులు తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు పొందేలా, కుటుంబ అవసరాలను తీర్చుకునేలా ఈ విధానం దోహదపడుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్ అవకాశాలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ప్రతి శాఖ తమ కార్యాచరణ ప్రణాళికను మండల రెవెన్యూ అధికారికి సమర్పించగా, సమగ్ర మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా జూన్ 19న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నిడిగల్లు గ్రామంలో సాంకేతిక సలహాల వర్క్‌షాప్‌తో పాటు క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
ఈ సమావేశంలో మండల రెవెన్యూ అధికారి శ్రీమతి రెడ్డి లక్ష్మి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రంగారావు, మండల వ్యవసాయ అధికారి శేఖర్ నాయక్, పశుగణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, వెలుగు శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అత్యవసర సమావేశం….
