ఏపీ లిక్కర్ కేసు: ప్రణయ్ ప్రకాశ్ విలాసాలు, నగదు కట్టల గుట్టు విప్పిన సిట్ ఛార్జిషీట్..!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ దర్యాప్తులో అత్యంత కీలకమైన మైలురాయి నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం… ఏసీబీ కోర్టులో మరో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ తాజా ఛార్జిషీట్‌లో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ ఆర్థిక లావాదేవీలను సిట్ ఆధారాలతో కోర్టు ముందు ఉంచింది.

 

సిట్ సమర్పించిన నివేదిక ప్రకారం.. వివిధ డిస్టిలరీల నుంచి వందల కోట్ల రూపాయల మేర వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణయ్ ప్రకాశ్ అత్యంత కీలక సూత్రధారిగా వ్యవహరించారు. ఈ వసూళ్ల పర్వంలో ఆయన ఒంటరిగా కాకుండా, లూప్‌లో ఉన్న పలువురు ప్రభావవంతమైన వ్యక్తులతో కలిసి ఒక సిండికేట్‌గా పనిచేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.

 

ప్రణయ్ ప్రకాశ్ మద్యం అక్రమ సంపాదనతో ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపారనేది సిట్ ఛార్జిషీట్‌లో వివరంగా పేర్కొంది. వైసీపీ నేత చెవిరెడ్డితో కలిసి పలుమార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌ కెసిరెడ్డితో కలిసి చార్టర్డ్ విమానాల్లో ప్రయాణిస్తూ, దేశ విదేశాల్లోని అత్యంత ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ కోట్లాది రూపాయలు విలాసాలకు తగలేసినట్లు సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన మరో దిగ్భ్రాంతికరమైన అంశం ఏమిటంటే… మద్యం అక్రమ లావాదేవీల ద్వారా వసూలైన లెక్కల్లో లేని భారీ నగదును దాచడానికి నిందితులు ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పలు నగరాల్లోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కేవలం నగదు దాచడానికే అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్లలోని రహస్య ప్రదేశాల్లో పెద్ద ఎత్తున నగదు కట్టలను భద్రపరిచినట్లు సిట్ ఆరోపించింది.

 

ఈ గుట్టు మొత్తాన్ని సిట్ అధికారులు పక్కా టెక్నికల్ ఆధారాలతో బట్టబయలు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌ల నుంచి సేకరించిన డేటాను డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేయడం ద్వారా ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, లొకేషన్ డేటా, వాట్సాప్ చాట్‌లను సమగ్రంగా క్రోడీకరించి ఏసీబీ కోర్టుకు సమర్పించారు.

 

సిట్ దాఖలు చేసిన ఈ తాజా ఛార్జిషీట్ ఆధారంగా రాబోయే రోజుల్లో మరికొందరు కీలక నేతలకు, అధికారులకు నోటీసులు వచ్చే అవకాశం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది

Posted Under AP
Editor