అనంతపురం జిల్లా, రాయదుర్గం.
*మంచినీటి సరఫరా లో నిర్లక్ష్యం సహించను అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మంచినీటి సరఫరా సమస్యపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారుల పనితీరు, శాఖల మధ్య సమన్వయ లోపంపై మండిపడ్డారు.
“మంచినీరు ప్రజల కనీస అవసరం. ఉన్న నీటిని కూడా సక్రమంగా అందించలేకపోతే అంతకంటే అసమర్థత ఇంకేముంటుంది..? రాయదుర్గం ప్రజలు మంచివారు కాబట్టి బతికి పోతున్నాం. లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవి” అంటూ అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు.
రాయదుర్గం ప్రజలకు రోజుమార్చి రోజు లేదా కనీసం మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది రోజులకోసారి కూడా నీరు సరఫరా చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి పని చేయాలని అధికారులకు సూచించారు.
“ఇదే సమస్య మీ ఇంటిదయితే ఇలాగే ఉంటారా..?” అంటూ అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే, ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం విధి నిర్వహణ కోసమే పని చేయడం సరికాదన్నారు. ప్రజల్లో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించొద్దని హెచ్చరించారు.
సోమవారం నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలను స్వయంగా సందర్శిస్తానని తెలిపారు. అక్కడ సంబంధిత అధికారులను పిలిచి ప్రజల ముందే వివరణ కోరుతానని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని, అవసరమైతే క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, పార్టీ అధికార ప్రతినిధి పోరాళ్ల పురుషోత్తం, డీఈ సురేష్, ఏఈ నాగభూషణం, ఎలక్ట్రికల్ ఏడీఈ శ్రీనివాసు, ఏఈ బాలు తదితరులు పాల్గొన్నారు.
