అనంతపురం జిల్లా, రాయదుర్గం.
- రైతులను ధగా చేస్తుంటే కమిషనర్ ఏంచేస్తున్నాడు
- సమస్యలపై ఇక పోరాటమే.. కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయదుర్గం మార్కెట్ సంతలో రైతులు, వ్యాపారుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మూడు రూపాయలు తీసుకోవల్సిన చోట పది రూపాయలు, ఐదు రూపాయలు తీసుకోవల్సిన చోట రూ.30 వరకు వసూలు చేస్తున్నారని, అంతేకాకుండా రసీదులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సరైన విధంగా పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనతా వారతి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధికారులు తప్పు చేస్తే వారిని బాధ్యతాయుతంగా పనిచేయించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.తాను నిన్న రాయదుర్గం మార్కెట్ సంతకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకున్నానని అయితే దీనిని రాజకీయ రంగు పులిమి తనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం మాత్రమే రైతుల నుంచి రుసుములు వసూలు చేయాలని అదనపు వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
