శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాబా సమాధి వద్ద అంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్శనలో మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. సత్యసాయి బాబా అందించిన సేవలు, మానవాళికి ఆయన చూపిన మార్గం ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా లోకేష్ గుర్తుచేసుకున్నారు. ట్రస్ట్ నిర్వాహకులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడటంతో పాటు, ఆ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
