రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు…

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి మడుగుతేరు అత్యంత వైభవంగా జరిగింది.
ఉదయం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మహిళలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ చిన్న రథంలో స్వామివారిని తేరుబజార్ వరకు ఊరేగించారు.

తేరు వద్ద వేద పండితులు గణపతి, శాంతి, వాస్తు, రథాంగ హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక రథంలో శ్రీవారిని ప్రతిష్ఠించి, భక్తుల గోవింద నామస్మరణల మధ్య పేరు బజార్ నుండి వినాయక సర్కిల్ వరకు మడుగు తేరును లాగారు.
ఈ కార్యక్రమానికి రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏపీఎస్ ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
రాయదుర్గం పురవీధులన్నీ “ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా, నారాయణ” నామస్మరణలతో మారుమ్రోగాయి. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మడుగుతేరులో పాల్గొన్నారు. సాయంత్రం శ్రీవారి బ్రహ్మరథోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు.

Posted Under AP
Editor