పేరుకే చలివేంద్రం… తాగునీటి కోసం ప్రజల అవస్థలు..

పేరుకే చలివేంద్రం… తాగునీటి కోసం ప్రజల అవస్థలు
ముదిగుబ్బ, మే 7:
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకు ఉపయోగపడకుండా పేరుకే నిలిచిపోయింది. మండుతున్న ఎండల్లో దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో నీటి సౌకర్యం లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చలివేంద్రం వద్ద కుండలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో నీరు లేకపోవడం గమనార్హం. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో శుద్ధి చేసిన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయానికి నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారని, కనీస తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చలివేంద్రాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Posted Under AP
Editor