తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) పార్టీ అనూహ్యమైన ఆధిక్యాన్ని సాధిస్తుండటంతో, చెన్నై నీలాంకరైలోని విజయ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడు రాజకీయాల్లోనూ ‘విజయ్’ దుందుభి మోగిస్తుండటంతో వేల సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన ఇంటి బాల్కనీలోకి వచ్చిన విజయ్, తనను చూడటానికి తరలివచ్చిన జనవాహినికి చిరునవ్వుతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అభివాదం చేశారు. గెలుపు జోష్‌లో ఉన్న అభిమానులను చూసి ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.
విజయ్ అభివాదం చేయడంతో అభిమానుల కేరింతలు, నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ‘తమిళనాడు తదుపరి సీఎం దళపతి’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేవలం ఒక సినీ నటుడిగానే కాకుండా, ప్రజల గొంతుకగా మారి దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను సవాల్ చేసిన విజయ్.. ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తన హావభావాల ద్వారా వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
