అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. క్రైమ్ నెంబర్ 33/2026 కింద నమోదైన ఈ కేసులో బోయ సుకన్య (34)ను అరెస్ట్ చేయగా, ఆమె మైనర్ కుమార్తెను (CCL) అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ రవిబాబు ఆదేశాల మేరకు సీఐ పి. గణేష్ నేతృత్వంలో పోలీసులు మల్లాపురం క్రాస్ వద్ద శనివారం ఉదయం నిందితులను పట్టుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం… పాతచెరువు గ్రామానికి చెందిన సుకన్యకు 17 సంవత్సరాల క్రితం బోయ హనుమంతుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా హనుమంత మద్యం అలవాటు పడి భార్యపై అనుమానం పెంచుకోవడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. ఈ విభేదాల నేపథ్యంలో భర్తను హత్య చేయాలని సుకన్య ముందుగానే నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.గత సంవత్సరం నవంబర్ 10-11 తేదీల మధ్య రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. తెల్లవారుజామున కోపోద్రిక్తురాలైన సుకన్య, ఇంట్లో ఉన్న రోకలిబండతో భర్త తలపై పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కనే గుంత తవ్వి పూడ్చిపెట్టి, రక్తపు మరకలను శుభ్రం చేసి ఘటనను దాచిపెట్టింది.హనుమంత కనిపించడంలేదని బంధువులు ప్రశ్నించగా, కూలి పనికి వెళ్లి తిరిగి రాలేదని సుకన్య తప్పుదారి పట్టించింది. అయితే ఇటీవల కుమార్తెతో జరిగిన వివాదం సమయంలో అసలు విషయం బయటపడింది. దీనితో మృతుడి తండ్రి లక్ష్మన్న ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మార్చి 29న అధికారుల సమక్షంలో శవాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం అమరావతి ల్యాబ్‌కు పంపిన ఎముకల నమూనాలు హనుమంతవేనని నిర్ధారణ అయ్యింది.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన సీఐ గణేష్ మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ రవిబాబు అభినందించారు.
బైట్ :- రూరల్ సీఐ గణేష్ కళ్యాణదుర్గం
