అనంతపురం జిల్లా, రాయదుర్గం.
మహిళా భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట.
రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనీస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
రాయదుర్గం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహిళలు, బాలికల భద్రత పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. వారిపై ఎలాంటి ఆఘాయిత్యాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలకు ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేసిందన్నారు. తమ వద్ద ఉన్న ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏ సమయంలోనైనా పోలీసులను సంప్రదించవచ్చన్నారు. ఆకతాయిల బెదిరింపులు, దౌర్జన్యాలకు భయపడకుండా ఎలాంటి సమస్య అయినా పోలీసులతో చర్చించవచ్చున్నారు. వారిని జాగృత పరిచేందుకే ప్రభుత్వం అవగాహన కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందన్నారు. అన్యాయాలను, దౌర్జన్యాలను ఎదిరించి గట్టిగా నిలబడి పోరాడే అనితమ్మను హోం శాఖ మంత్రిగా సీఎం. నియమించారన్నారు. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ మహిళలను బాలికలను చైతన్య పరుస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తతతో ఉండాలని, ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే ధైర్యంగా పోరాడాలన్నారు.
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మహిళల్లో సామాజిక మార్పు, ఆత్మ విశ్వాసాన్ని తప్పక పెంచుతాయన్నారు.
మహిళల రక్షణకు తీసుకునే చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు కూడా తోడ్పాటు అందించాలనీ కోరారు. సమాజం మొత్తం కలిసి పనిచేసినప్పుడే పూర్తి స్థాయి భద్రత సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మహిళలు, బాలికల సంక్షేమానికి మరింత దోహదపడతాయని ఎమ్మెల్యే కాలవ అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బండి భారతి,కురుబ ప్రశాంతి, సంపత్ కుమారి, బీజేపీ నాయకురాలు వసుంధర దేవి తదితరులు పాల్గొన్నారు.
