ముదిగుబ్బ, యస్ 9: రాష్ట్ర ప్రభుత్వం నీటి భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార” 100 రోజుల యాక్షన్ ప్లాన్ భాగంగా ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లి గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సెక్రటరీ, ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆధ్వర్యం వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని కార్యక్రమంపై అవగాహన పొందారు.ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మత్తు, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి సంరక్షణ వంటి కీలక పనులను వేగంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వడం, సప్లై చానళ్ల పరిశీలన, చెక్‌డ్యామ్‌లు, పర్కొలేషన్ ట్యాంకుల అభివృద్ధి, పూడికతీత పనులపై ప్రజలకు వివరించారు. కార్యక్రమం ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన పనులను గుర్తించి, వాటి అమలుకు ప్రజల సహకారం అవసరమని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన “నీటి భద్ర –సాగునీటి సంఘాల బాధ్యత” యాప్ వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పనులను అనుసంధానం చేసి గ్రామ స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ కార్యక్రమం కీలకంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
