అనంతపురం జిల్లా
ప్రభుత్వ పాలిటెక్నిక్,కళాశాల వార్షికోత్సవం
అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా, అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సి. జయచంద్ర రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జెఎన్టీయూ అనంతపురం ఉపకులపతి ప్రొఫెసర్ హెచ్. సుదర్శన్ రావు గారు, గౌరవ అతిథిగా హువాసంగ్ ఏఐ ఆటోమోటివ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జాంగ్ డు వన్ గారు విచ్చేశారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు మాట్లాడుతూ, విద్యార్థులు విజ్ఞాన దృక్పథం కలిగి ఉండి, తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి విశేష ప్రోత్సాహం అందిస్తోందని, అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. దీని ద్వారా భవిష్యత్తులో అనేకమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతపురం పాలిటెక్నిక్ విద్యార్థుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
గౌరవ అతిథి శ్రీ జాంగ్ డు వన్ గారు విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే సందర్భంగా హువాసంగ్ సంస్థ సీనియర్ హెచ్‌ఆర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ సంస్థలో కొంతమంది విద్యార్థులకు మాత్రమే అప్రెంటీస్ అవకాశాలు కల్పించామని, ఇకపై మరింత మంది విద్యార్థులకు అవకాశాలు అందిస్తామని తెలిపారు.
తదుపరి ప్రిన్సిపాల్ శ్రీ సి. జయచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ, కళాశాల ఈ విద్యా సంవత్సరంలో సాధించిన విజయాలను వివరించి, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ప్రిన్సిపాల్, విభాగాధిపతులు మరియు అధ్యాపకులు సత్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించబడాయి.
