అనంతపురం జిల్లా
“దివ్యాంగ శక్తి”కి శ్రీకారం
– : అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, తదితరులు..
– : దివ్యాంగ శక్తి కింద 21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
– : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
– : 74 శాతం ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
– : అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
– : ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరం
– : సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
– : హర్షం వ్యక్తం చేసిన దివ్యాంగులు
అనంతపురం, మార్చి 18 :
– అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం “దివ్యాంగ శక్తి” (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దివ్యాంగ శక్తి ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ ఎం.కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్య జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్, తదితరులు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు దివ్యాంగులతో కలిసి ఉచిత బస్సుల్లో ప్రయాణించారు. అర్బన్ ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పోస్టర్లను ఆవిష్కరించారు. దివ్యాంగ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం హర్షం వ్యక్తం చేస్తూ దివ్యాంగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
– ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ఈరోజు నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగుల ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా దివ్యాంగ శక్తిని ప్రారంభించడం జరిగిందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా స్థాయిలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు మరియు ప్రత్యేక అధికారులు దీనిని పర్యవేక్షిస్తున్నారన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడం చేయాలన్నారు. గతంలో కేవలం 4 రకాల వైకల్యాలు ఉన్న దివ్యాంగులకు మాత్రమే రాయితీలు ఉండేవని, కానీ ఇప్పుడు ఈ సంఖ్యను 21 కేటగిరీలకు పెంచారన్నారు. 21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ సదరం (SADAREM) సర్టిఫికేట్ లేదా ఆర్టీసీ పాస్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చన్నారు. సుమారు 74 శాతం ఆర్టీసీ బస్సులలో (పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో) దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందన్నారు. అయితే ప్రీమియం ఏసీ మరియు డీలక్స్ బస్సులకు ఇది వర్తించదన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా మరిన్ని అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగుల సంఘాలు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు.
– అనంతపురం జిల్లాలో ఏడు ఆర్టీసీ డిపోలు ఉండగా, అందులో 88 ఎక్స్ప్రెస్ బస్సులలో, 12 అల్ట్రా పల్లెవెలుగు బస్సులలో, 216 పల్లెవెలుగు బస్సులలో మొత్తం కలిపి 316 బస్సులలో ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చన్నారు. 1.లోకోమోటర్ వైకల్యం, 2.కుష్టు వ్యాధి నయమైంది, 3.సెరిబ్రల్ పాల్సీ, 4.మరుగుజ్జుతనం, 5.కండరాల బలహీనత, 6.యాసిడ్ దాడి బాధితురాలు, 7.అంధత్వం, 8.తక్కువ దృష్టి, 9.చెవిటి, 10.వినికిడి లోపం, 11.వైకల్యం, 12.మేధో వైకల్యం, 13. నిర్దిష్ట అభ్యాస వైకల్యం, 14.ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, 15.మానసిక అనారోగ్యం, 16.మల్టిపుల్ స్క్లెరోసిస్, 17.పార్కిన్సన్స్ వ్యాధి, 18.హీమోఫిలియా, 19.తలసేమియా, 20.సికిల్ సెల్ వ్యాధి, 21. బహుళ వైకల్యాలు కలిగిన కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
– ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. గతంలో ఉన్న పెన్షన్లను 3,000 నుండి 4,000 రూపాయలకి మరియు దివ్యాంగులకు 6,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదేనని పేర్కొన్నారు. వైద్య సాయం కింద అందించే మొత్తాన్ని 10,000 రూపాయలకు, అలాగే తీవ్రమైన వెన్నెముక సమస్యలు ఉన్నవారికి 15,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా 74 శాతం ఆర్టీసీ బస్సులలో (ప్రీమియర్ ఏసీ బస్సులు మినహా) దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. తోడుగా వచ్చే వారికి రాయితీ అందిస్తామని, నిబంధనల ప్రకారం ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా ప్రయాణం ఛార్జీలలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు దాదాపు 45 కోట్లకు పైగా ప్రయాణాలు సాగాయని, ప్రభుత్వంపై ఏడాదికి 3,500 కోట్ల భారం పడినా వెనకాడకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. దీపం పథకం, పరిశ్రమలకు రాయితీలు మరియు యువత కోసం మంత్రి లోకేష్ తీసుకుంటున్న చొరవను గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తమ ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక బోర్డులు మరియు చైర్మన్లను నియమించి ఆర్టీసీకి పూర్వవైభవం తెస్తున్నామన్నారు.
– ఈ సందర్భంగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, చదువుకోవడానికి పట్టణాలకు వెళ్లే విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇప్పటికే దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ను 6,000 రూపాయలకు, మరియు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గౌరవంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతకాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమన్నారు. మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి, ఇచ్చిన హామీల కంటే అదనంగా ఈ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో దివ్యాంగులను కూడా భాగస్వామ్యం చేస్తూ, వారికి మెరుగైన జీవితాన్ని అందించడమే ఈ ‘దివ్యాంగ శక్తి’ పథకం యొక్క ముఖ్య లక్ష్యమన్నారు.
– ఈ సందర్భంగా ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాల్లో భాగంగా, ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతంగా అమలువుతోందని, దీనికి కొనసాగింపుగా, దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం అవుతోందన్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరూ ఈ పథకానికి అర్హులు అని, గతంలో దివ్యాంగులకు టికెట్ ధరలో 25 శాతం నుండి 40 శాతం వరకు రాయితీ ఉండేదని, కానీ ఇప్పుడు 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడిందన్నారు. ఈ పథకం ద్వారా అనంతపురం జోన్ పరిధిలో సుమారు 16,000 మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నిర్వీర్యం అయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, ప్రయాణ సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
– ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ హర్షదుల్లా, ఇంచార్జి ఆర్డిఓ రామ్మోహన్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, దివ్యాంగులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
