- అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం
- ఫిర్యాదుల పరిష్కారంలో తొలి స్థానంలో రాయదుర్గం.
- _ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో రాయదుర్గం నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. రాయదుర్గం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాయదుర్గం నియోజకవర్గ ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులను అధికారులు అత్యంత బాధ్యతగా తీసుకొని పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 690 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందన్నారు. అందులో 553 సమస్యలను పరిష్కరించామన్నారు. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదుదారుడికి నాణ్యమైన పరిష్కారాన్ని చూపించడం జరుగుతుందన్నారు. నిధులతో సంబంధంలేని సమస్యలను త్వరతగతిన పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నిబంధనలకు అనుకూలంగా ఉన్న వాటిని కింది స్థాయిలో పరిశీలించి నిర్ధారించిన తర్వాత పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హత ఉన్న వారిని నిర్ధారించి ప్రాధాన్యత క్రమంలో వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. ఆ విధంగా సమస్యల పరిష్కారంలో అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం అత్యుత్తమ నియోజకవర్గంగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాయదుర్గం విజన్ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందిస్తుండటం వల్లే ఈ స్థానం లభించిందన్నారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని బాధ్యతతో చేపట్టిన అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో రాబోయే ఫిర్యాదులను కూడా అంతే బాధ్యతగా పరిష్కరిస్తూ తొలి స్థానాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
