తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనగామ మున్సిపాలిటీలో ‘హంగ్’ ఏర్పడటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన స్పష్టమైన మెజార్టీ (మేజిక్ ఫిగర్) రాకపోవడంతో, రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి సారించాయి. ముఖ్యంగా 15వ వార్డులో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి పాండు ఇప్పుడు ఇక్కడ కింగ్ మేకర్‌గా మారారు. ఆయన మద్దతు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉండటంతో రెండు పార్టీల నేతలు పాండు కోసం పోటీ పడ్డారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద పాండును తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు విశ్వప్రయత్నాలు చేశారు. ఆయనను తమ వాహనాల్లో ఎక్కించుకుని క్యాంపులకు తరలించే ప్రయత్నం చేయగా, రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట మరియు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గట్టి నిఘా ఉంచారు.
అయితే, స్వతంత్ర అభ్యర్థి పాండు రెండు పార్టీల నేతలకు షాక్ ఇస్తూ సంచలన డిమాండ్ ముందకు తెచ్చారు. తనకు మద్దతు కావాలంటే తననే మున్సిపల్ చైర్మన్ చేయాలని ఆయన పట్టుబట్టారు. రెండు ప్రధాన పార్టీల నేతలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, పాండు తన డిమాండ్‌కే మొగ్గు చూపారు. తన షరతుకు అంగీకరించకపోవడంతో ఆయన అక్కడి నుంచి అసహనంతో వెళ్ళిపోయారు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు అయోమయంలో పడ్డారు. జనగామ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
