- రైతులు ప్రకృతి వ్యవసాయం పై మొగ్గు చూపాలి..
- రైతు సంఘాల ద్వారా సమిష్టి వ్యవసాయం చేయాలి.
- జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్..
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా – సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా శారద జయలక్ష్మి దేవ, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొని వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిసాన్ మేళా – సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో, రైతులు విత్తనం వేయడం నుండి కోత దాకా సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, రైతు సంఘాలు ద్వారా సమిష్టిగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. 10–15 మంది రైతులు కలసి సాగు, కొనుగోలు, మార్కెటింగ్ నిర్వహిస్తే లాభదాయకత పెరుగుతుందని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న “అన్నదాత సుఖీభవ” వంటి పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంవత్సరానికి సుమారు ₹20,000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. అలాగే మైక్రో ఇరిగేషన్ పరికరాలు, వ్యవసాయ యాంత్రీకరణ సాధనాలు, రుణ సౌకర్యాలు తదితర మద్దతు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు.
రైతులు ఇతరులు ఏమి పండిస్తున్నారో అనుసరించడం కాకుండా వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను సంప్రదించి శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలి అని సూచించారు. గతంలో అనుభవించిన పంట నష్టాల ఉదాహరణలను ప్రస్తావిస్తూ, సరైన సలహాలు తీసుకోకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
