కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం సార్వత్రిక సమ్మె చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ
కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని, ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వేలు, బ్యాంకులు, ఎల్‌ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగిస్తే సహించేది లేదన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గురవయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి గురవయ్య, ఏఐటీయూసీ నాయకులు రవి, ఐఎఫ్టీయూ నాయకులు జాకీర్, భారతి, సీఐటీయూ నాయకులు మణి, కుమార్, వెంకటేష్, కరీముల్లా, వేణు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమ్మె… నల్ల చట్టాలు రద్దు చేయాలి…
