మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రచారంలో భాగంగా ఒక మహిళ “మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ. 2,500 ఏమైంది?” అని ప్రశ్నించగా, మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ప్రభుత్వం నేరుగా నగదు ఇవ్వకపోయినా, వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు నెలకు రూ. 3,000 కంటే ఎక్కువే ఆదా అవుతోందని ఆయన వాదించారు.
మంత్రి తన వాదనను సమర్థిస్తూ ప్రధానంగా మూడు పథకాల లెక్కలను వివరించారు. ఉచిత విద్యుత్ (200 యూనిట్లు) ద్వారా నెలకు రూ. 800, సన్నబియ్యం పంపిణీ ద్వారా రూ. 2,500, మరియు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా సుమారు రూ. 500 చొప్పున ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. ఈ రకంగా చూస్తే మహిళలకు ప్రభుత్వం నుంచి పరోక్షంగా అందుతున్న సాయం తాము వాగ్దానం చేసిన రూ. 2,500 కంటే ఎక్కువేనని ఆయన స్పష్టం చేశారు.
అయితే, మంత్రి చేసిన ఈ ‘లెక్కల వివరణ’పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన నగదు బదిలీని, ఇతర ఉచిత పథకాలతో ముడిపెట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నేరుగా చేతికి అందాల్సిన నగదు సాయం కోసం నిరుపేద మహిళలు ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం ఈ రకమైన లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ‘నగదు వర్సెస్ పరోక్ష లబ్ధి’ వివాదం ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
