అంబటి ఇంటి ముట్టడి: గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత – క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముట్టడించాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు, మహిళలు గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు. అంబటి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, రెండు చేతులు జోడించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన సందర్భంగా అంబటి నివాసం వద్ద పరిస్థితులు అదుపు తప్పాయి. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, పూలకుండీలు ధ్వంసం అవ్వడమే కాకుండా, బయట నిలిపి ఉంచిన కారు కూడా పాడైంది. మహిళా కార్యకర్తలు చీపురు కట్టలతో నిరసన తెలుపుతూ అంబటిని వెంటనే అరెస్ట్ చేయాలని నినదించారు. ముఖ్యమంత్రిని దూషించడం హేయమైన చర్య అని, ఇలాంటి పద్ధతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఘటన ఒక్కసారిగా వేడిని పెంచింది. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేతలు హెచ్చరిస్తుండగా, అంబటి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంబటి ఇంటిని ముట్టడించిన ఘటనను పలువురు వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ప్రస్తుతానికి గుంటూరులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Posted Under AP
Editor