సందీప్ రెడ్డి చేసింది కేవలం రెండు సినిమాలే అయినా ఈయన మాత్రం పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సందీప్ రెడ్డి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అనంతరం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి(Sandeep Reddy) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక హీరో సినిమాలో మరొక హీరో క్యామియో చేయటం సర్వసాధారణం అయింది. ఇక స్పిరిట్ సినిమాలో కూడా మరొక హీరో నటించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
స్పిరిట్ సినిమాలో విజయ్ దేవరకొండ?
ఈ వార్తలకు అనుగుణంగానే నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వరుసగా సందీప్ రెడ్డిని కలవడంతో క్యామియో పాత్ర గురించి వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ వేదికగా అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేశారు. దీంతో స్పిరిట్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించడం కన్ఫామ్ అని సందీప్ రెడ్డి ఇలా హింట్ ఇస్తున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు.
ఫోటోతో హింట్ ఇచ్చిన సందీప్ రెడ్డి..
ఇలా ఉన్నపలంగా సందీప్ రెడ్డి విజయ్ దేవరకొండ ఫోటోలను షేర్ చేయడంతో ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారా? లేదా అనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే విజయ్ దేవరకొండ కెరియర్ కు కూడా ఎంతో ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయం పై స్పష్టత రావాలి అంటే సందీప్ రెడ్డి స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక స్పిరిట్ సినిమాలో చిరంజీవి కూడా నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను స్వయంగా సందీప్ రెడ్డి ఖండించిన సంగతి తెలిసిందే.
ఇక స్పిరిట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా త్రిప్తి దిమ్రి నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, డాన్ లీ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టడం కోసం ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ స్పిరిట్ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని 2027 మార్చి 25వ తేదీ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.
